హైదరాబాద్: స్వామినాధన్ కమిటీ సిఫార్సుల మేరకు వరికి రూ.1,600 మద్దతుధర ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని కోరింది. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. వరికి కనీస మద్దతు ధర రూ.1,030గా ఉంటే, ఆచరణలో రూ.800కి మించి ధర రావటం లేదని అన్నారు.
కిందటేడాది పండించిన ధాన్యమే ఇంకా రైతుల వద్ద ఉందనీ, దానికే మద్దతు ధర దక్కటం లేదని చెప్పారు. శాఖల కేటాయింపు వివాదాల్లో ఉన్న మంత్రులు, ప్రభుత్వం ఇంకా రైతు సమస్యలపై దృష్టి సారించలేదని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని, దీనిపై ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదని ఐకేపీ సంఘాలు చెబుతున్నాయని వెల్లడించారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలన్నీ వరి రైతులకు మద్దతు ధరకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తుంటే, మనరాష్ట్రంలో అసలు మద్దతు ధరే అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగమతులకు అనుమతి ఇచ్చినందువల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆయా రాష్ట్రాల్లోనూ పుష్కలంగా కురిసిన వర్షాలతో వరి దిగుబడులు పెరిగాయని వివరించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో మార్కెట్ల సందర్శన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.